Monday, April 10, 2017

రెండు చిలుకలు 5


తిరిగి వచ్చిన తరువాత వారి వారి పనులలో నిమగ్నమయినారు. సరోజ పాత శాలలలో చదువు చెప్పే పధ్ధతి కొంచెము బాధను కలిగించింది. ఇందులో తను ఏమయినా చేయ గలనా అని ఆలోచించేది. తను చదువుకున్నపుడు కూడా ఇదే పరిస్థితి. చదువు అంతా యాంత్రికముగా నడిచింది.  ఇది మంచి, ఇది చెడు అని చెప్పే చదువులు కావు. అంతా పోటీ. అనుక్షణము ఎలా చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి? ఎలా మొదటి స్థానములో ఉండాలి? ఇదే ప్రధానమయిన లక్ష్యము. అనుక్షణము మనస్సులో ఉండేదొకటే. పోటీ... పోటీ.... పోటీ.... “స్పర్థయా విందతే  విద్య” అని యన్నారు. అప్పుడు ఉద్దేశ్యము ఒకటయితే  ఇప్పుడది పూర్తిగా మారి పోయింది.  మామయ్యా గారి దగ్గర తెలుగు శతక వాఙ్మమయము గూర్చి తెలుసుకొంది. మనిషి ఎలా నడచుకోవాలన్నది సుమతి శతకము, కాస్త సామర్థ్యము ఉంటె భర్తృహరి  నీటి శతకము, లోక ప్రవృత్తికి భాస్కర శతకము, నృసింహ శతకము, ఇంత వైవిధ్యము తను హిందీ లో చదువుకున్నట్లు గుర్తు లేదు. అందుకు కారణము కూడా ఉంది. ఆ నాడు తనకు మార్కులు తెచ్చు కావాలన్న ధ్యాస తప్ప అతము చేసు కావాలన్న మానసిక స్థితి లేదు.
అంతే కాదు, ఛందస్సు తో కూడిన పద్యాలలో అంతరంగముగా సంగీతము వినిపించేది. ఇంకా పాట పాడుకోవడానికి , పద్యము చదువుకోవడానికి తేడా కనిపించేది కాదు. ఒక రిక్షా లాగే వ్యక్తీ నోట్లో కూడా  కృష్ణ రాయ భారము లేదా పోతన భాగవతము పద్యాలు వినిపించేవి. తను నెల్లూరు లో ఇవన్నీ గమనించినది.
వరి కోతలయిన తరువాత  దక్ష యజ్ఞము, భక్త ప్రహ్లాద నాటకాలను వేసే వారు. రాత్రంతా మేలుకొని జనము వీటిని చూచే వారు.
క్రమముగా  రాజకీయ నాయకుల వోట్ల వ్యాపారము  కొత్త పుంతలు దోక్కినది. తను అధికారములో ఉండాలంటే దేనినైనా అమ్ముకోవచ్చును, అనే ప్రవృత్తి విద్య విధానము మీద పడింది. ఒక నీతి కథ చెబితే మత ప్రచారము చేస్తున్నారనే ప్రబుద్ధులు తయారయినారు. ఇందులో భాగముగా ప్రైవేటు విద్య సంస్థలు పుట్టుకొని వచ్చినాయి. వాటికి పిల్లలకు చదువు చెప్పడము కంటే వారి తల్లి దండ్రులను ఆకట్టు కోవడము ఎక్కువయింది. నీతి, నడవడిక లను బోధించే పాఠ్యాంశాలు  క్రమముగా తగ్గి పోయినాయి.
తను చదువుకోక పోయినా వాణి చేత సుమతి శతక పద్యాలు చదివించేది. ఎప్పుడూ చిరాకు పడకుండా బుజ్జగించేది. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క  నీతి కథ చెప్పేది. వాణి కథ కోసము పద్యమును కంఠస్ఠము చేసేది.
తను లలితా సహస్ర నామము చదువుతుంటే శ్రద్ధగా వినేది. ఎంత శ్రద్ధగా వినేదంటే తను ఎక్కడయినా తడబడితే అందించేది. ఊళ్ళో బడికి పంపిస్తున్నా ఇంట్లో తన శిక్షణ లోనే ఉండేది.
రామును అడిగేది, “మన విద్యా విధానములో మార్పులు ఎటు దారి తీస్తున్నాయి?” యని.
“మనమే ముందు వెళ్ళాలేమో యనేది. తను చదివిన పి జి ఫిజిక్స్ తనకు ఒక అవగాహనను కల్గించింది. ఆ శిక్షణతో ఏ పాఠ్యాంశమును అయినా అర్థము చేసుకోవచ్చును. క్రమ క్రమముగా తన పిల్లల కోసము తను ప్రణాలికలు వేయాలనుకుంది.  కానీ,,”ఎలా మొదలు పెట్టాలి?” అంతే కాదు తన పిల్లల కున్న అవకాశము చుట్టూ ప్రక్కల ఉన్న ప్రతి వారికి రావాలి. ఇదే ఆలోచన. అప్పుడప్పుడు రాముతో బాటు నెల్లూరు వెళ్లి పాత పుస్తకాల షాపులలో పాత పాఠ్య పుస్తకాలను చూచేది. అప్పుడు మరొక విషయము కొట్టొచ్చినట్లు కనిపించినది. ఇరువది ఏళ్ల క్రిందట పిల్లలకు ఎలా సులభముగా అర్థమవుతాయా అనే ఉద్దేశ్యముతో పుస్తకాలు వ్రాయ బడినాయి. ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందంటే “ఎలా వ్రాస్తే , పరీక్షలలో ప్రశ్నలకు జవాబులు వ్రాస్తారు?”అనే ధోరణి వచ్చింది. రసము పోయింది, పిప్పి మిగిలింది.
రోజూ రామూ తో ఇవన్నీ చర్చించేది. విసుగు పడకుండా వినే వాడు. మెచ్చుకోలుగా చూచే వాడు. అంతకు మించి సూచనలు ఏమీ రాలేదు.
ఇలా కాదని తను ఒక ప్రణాలికను ఏర్పరచుకొని ఆ పద్ధతిలో వ్రాయడము మొదలు పెట్టింది. అప్పుడప్పుడు, రాము వాటిని చూచి,”మంచి పనిని చేస్తున్నావు.” అని యంటే  చాలా సంతోషము వేసేది. ఇంకా ముందుకు వెళ్ళాలి.
ఇద్దరు పిల్లలను గూర్చి తనే పట్టించుకోనేది. అత్తగారితో పగలు చాలా సమయము గడిపేది. పూల మొక్కలను వేసేది. తన లక్ష్యమంతా ఒక్కటే, అందరూ సంతోషముగా ఉండాలి. ప్రతి సెకనునును ఒడిసి పట్టుకోవాలి. అలసట తన దగ్గిరకు రాకుండా చూచుకొనేది.
        ----------------------------------------
అప్పుడప్పుడు తల్లినుండి ఉత్తరాలు వచ్చేవి. అందులోనే నందిని కూడా  తన పిల్లాడి కబుర్లు వ్రాసేది. నందిని ఎప్పుడూ హిందీ లోనే వ్రాసేది.
ఒక సారి నందిని”భాభీ!(వదినా) అత్తయ్య బాగా నీరస పడింది. నిన్నే అనుకుంటున్నాది. తను ప్రయాణము చేయ లేనంటున్నది. నీవు ఇక్కడికి రావడము మాత్రము ఇష్టము లేదు.” అంటూ పెద్ద ఉత్తరము వ్రాసింది.
తనకు అమ్మ మీద దిగులు  మొదలయింది. తన కోసము ఎంత కష్ట బడిందో? ఇప్పుడు ఎలాగుందో? మరొక వైపు అక్కడికి వెల్లడము ఇష్టము లేదు. అమ్మనే ఇక్కడికి తీసుక వస్తే బాగుంటందని అనిపించింది. ఒక సారి రాముతో ఇదే మాట యన్నది. “ అమ్మ కూడా సంతోష పడుతుంది. ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు.” అన్నాడు. నందినికి ఇదే మాట ఉత్తరములో వ్రాసింది. ఈ లోపలే  టెలిగ్రామ్  వచ్చింది.”మథర్ సీరియస్”.అని. ఇంకా సరోజ మనస్సు మనస్సు లో లేదు.
అప్పుడు శ్యామలమ్మకు కాస్త నలతగా ఉంది. అయినా సరోజను దింపి రమ్మని రాము కు చెప్పింది. రాము తనకు తిరిగి రాను రిజర్వేషన్ కూడా చేసుకున్నాడు. పక్క ఇంటి వారితో తల్లిని గమనిస్తూ ఉండమని చెప్పి ఇద్దరూ బయలు దేరినారు. సరోజను డిల్లీలో దింపి తను తిరిగి వచ్చేసినాడు. రాణి అమ్మ తోనే ఉంటానన్నది.  తిరిగి వచ్చేటప్పుడు వాణిని తనతోనే తీసుకొని వచ్చినాడు.
వారము రోజులయినా శ్యామలమ్మ్కు వంట్లో నలత తగ్గ లేదు. ఎంతో మంది వైద్యులకు చూపించినాడు. రోజు రోజుకు ఆమె ఆరోగ్యము క్షీణిస్తున్నది. కాలేజికి సెలవు పెట్టి ఇంట్లోనే యున్నాడు. వాణి వలన కొంత కాలక్షేపము అవుతున్నది. నిద్రను కూడా తగ్గించి తల్లి సేవ లోనే యున్నాడు. ఇప్పుడు సరోజ లేని లోటు కనిపిస్తున్నది. అంతా తన భుజాల మీదనే పెట్టుకొని ఎట్లో అన్నీ చూస్తున్నాడు.
తల్లి  మగత లోనికి వెళ్ళింది. ప్రక్క వాళ్ళను కాస్త గమనిస్తూ ఉండమని చెప్పి, నెల్లూరు వెళ్లి సరోజ ఇంటికి ట్రంక్ కాల్ చేసినాడు. గంట తరువాత ఫోన్ మోగింది. ఎవరో ఫోన్ ఎత్తి ఏమీ తెలియనట్లు మాట్లాడినాడు. మళ్ళీ ప్రయత్నమూ  చేసినాడు.”సరోజా,  ఆ పేరుతొ ఎవరూ లేరు” అని హిందీ లో చెప్పి పెట్టివేసినాడు. వెంటనే సరోజ పేరున ఉత్తరము వ్రాసి పోస్టులో వేసి, మళ్ళీ టెలిగ్రం ఇచ్చి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చేసరికి తల్లి గతించింది. ఆఖరు క్షణాల్లో తను కూడా లేదు. రాముకు నిజముగా పిచ్చి ఎక్కినట్లయింది. కూతురు వాణికి పది ఏండ్లు. భార్య కూడా పక్కన లేదు. దగ్గిర బంధువులు ఎవరూ ఊళ్ళో లేరు. ఒక పూజారి కుటుంబము మాత్రము తనకు అండ గా ఉంది.
అత్తగారు పొతే కోడలు లేదని ఊళ్ళో అంతా నోరు నొక్కు కున్నారు. తనకు  దుఃఖము ఆగుట లేదు. వాణి ని పూజారింట్లో ఉంచి కర్మ కాండ పూర్తీ చేసినాడు . సరోజ రానే లేదు. తను తిరిగి వచ్చిన తరువాత ఒక్క ఉత్తరము కూడా లేదు.”సరోజకు ఏమయింది? ఇక్కడకు రావాలని అనిపించ లేదా?” బాధ పడినాడు. కార్యక్రమాలు అయిన తరువాత మళ్ళీ నెల్లూరు వెళ్లి ట్రంక్ కాల్ చేసినాడు. సమాధానము మళ్ళీ అదే. ఎవరో ఎత్తినారు. తనకు సంబంధము లేనట్లు ఏదో హిందీ లో చెప్పినాడు.
తనే డిల్లీ కి పోదామని అనుకున్నాడు. కానీ, వారి నుండీ ఎటువంటి సమాచారము లేకుండా, వారు రాకుండా తను వెళ్ళడము ఉచితము కాదని అనిపించినది. కూతురు కోసము కాలేజి ఉద్యోగమూ మాని వేసినాడు. చివరకు ఇంటికి తాళాలు వేసి, పక్క ఇంటి వారికి చెప్పి తను వాణి బయలు దేరినారు.
నేరుగా కన్యా కుమారి వెళ్ళినాడు. లోక కంటకుడయిన బాణుడిని చంపుటకు శాశ్వతముగా భర్తకు దూరమయిన తల్లి కన్యా కుమారి. ఆమెకు సంబంధించిన సుచీంద్రమును దర్శించినాడు. ప్రతి క్షణము ప్రతి విషయము వాణికి వివరించి చెప్పినాడు.  అక్కడ నుండి తిరువనంతపురము  వెళ్లి  మూడు గదులకు విస్తరించి యున్న అనంత పద్మ నాభ స్వామిని దర్శించుకున్నాడు. అక్కడ నుండి ఆయనకు లీలగా ఒక దృశ్యము కనిపిస్తున్నది. ఎక్కడికి వెళ్ళినా విపరీతమయిన వేదనతో సరోజ కనిపించేది. “సరోజకు ఏమయిందో?” అనిపించినది. కాని, నాన్న గారు చెప్పిన మాట జొన్న వాడలో ఒక సాధువు చెప్పిన మాట గుర్తుకు వచ్చినాయి. ఏదో ఒక తీవ్రమయిన కర్మ ఇది. అనుభవించక తప్పదు అనుకున్నాడు. చెంగన్నూర్ వెళ్లి జగన్మాత రాజ రాజేశ్వరిని  దర్శించుకున్నాడు. సరోజ రోజూ ఆరాధించే ఆమెకు మనస్సుతో నమస్కారము చేసుకున్నాడు. అక్కడ నుండి వెనక్కు తిరిగి రామేశ్వరము వచ్చినాడు. శ్రీ రామ చంద్రుడు  రావణ వధ తరువాత తిరిగి వచ్చిన చోటు. అక్కడ సముద్రము పై కట్టిన పంబన్ వంతెన అద్భుత మైనది.
సముద్రములో పడవ షికారు చేసినారు. లంగరు వేసిన పడవ ఊగుతుంటే  నిముషానికి ఎన్ని సార్లు ఊగుతుందో గమనించినాడు. అది నిముషానికి పదునారు సార్లు. మన శ్వాస కూడా నిముషానికి పదునారు సార్లు. దీనినే టెస్లా షూమను పౌనః పున్యమని అన్నారు.
అక్కడ నుండి మధుర చేరినారు. భర్తను విడి పోయిన పార్వతీ మాత పాండ్య రాజ కుమార్తె గా జన్మించి  శివుడిని వివాహమాడిన చోటు. శ్రీ మన్నారాయణుడు దగ్గిర ఉండి ఈ వివాహమును జరిపించినాడుట. ఆమె పాండ్య రాజుల ఆరాధ్య దైవము. వేగవతీ నది ఒడ్డున పాండ్య రాజులు కట్టించిన మీనాక్షి మందిరపు వైభవమునకు దేవతలే ఆశ్చర్య పోతారుట.
అక్కడనుండి  చోళ రాజుల రాజధాని తంజావూరు చేరినారు. అది శ్రీ రాజ రాజ చోళుడి యొక్క రాజ దాని. ఆయన నిర్మించిన బృహదీశ్వర ఆలయము గత వేయి సంవత్సరాలుగా చెక్కు చెదర కుండా ఉన్నది. ఆయన సోదరి రాజమహేంద్ర వరాన్ని పాలించిన రాజ రాజ నరేంద్రుడి తల్లి. ఆయన కుమార్తె రాజ రాజ నరేంద్రుడి ధర్మ పత్ని. మహా భారతపు తెలుగు అనువాదానికి విశేష ప్రేరణ ఇచ్చిన మహా మనీషి ఆవిడ.  ఇంకా రాజ రాజ నరేంద్రుడు నిర్మించిన బృహదీశ్వర ఆలయ శిఖరము ఒకే శిల మీద చెక్క బడినది. శిఖరము నీడ ఎక్కడా నేల మీద పడదు. ఈ ఆలయ నిర్మాణము ఒక గొప్ప నిర్మాణ విశేషముగా భావిస్తారు.
అక్కడ నుండి జంబుకేశ్వరము, శ్రీ రంగమును దర్శించినారు.పంచ భూత లింగాలలో జంబుకేశ్వరము ఒకటి. ఈ లింగము ఎప్పుడూ నీటితో తడిసి ఉంటుంది. ఇంకా శ్రీ రంగ నాథుడు రఘు వంశీకులకే కాకుండా విభీషణుడికి కూడా ఆరాధ్య దైవము. ఇంకా పంచ భూత లింగాలలో ఒకటైన ఆకాశ  లింగము చిదంబరములో ఉంది. మధ్యలో ఉన్న కుంభకోణము లో ఉన్న గుడులను చూచుటకు ఒక వారము కూడా సరి పోదు. అక్కడి నుండి తిరుపతి వచ్చినాడు. ఇంకా నెల్లూరు ఇతర ఆంద్ర ప్రాంతములను దాటి, భువనేశ్వరము,  ఉజ్జయిని, వారణాసి, అయోధ్య, హరి ద్వారము, గంగోత్రి, యమునోత్రి, ఋశీ కేశ్, కేదారనాథ్ క్షేత్రాలను చూచినారు. నివాసమునకు ఏదో ఒక ఆశ్రమము ను ఆశ్రయించి వీలయినన్ని రోజులు ఉండే వారు. కలకత్తా వెళ్లి అక్కడ దక్షిణేశ్వరములో  ఎక్కువ కాలమున్నాడు. ఈ విధముగా సుమారు రెండు సంవత్సరాలు తిరిగినారు. ఇంకా వాణి “నాన్నా! అమ్మ వస్తుందేమో? ఇంటికి పోదాము.” అనడము మొదలు పెట్టింది. “నాన్నా! అమ్మ ఇంక రాదా? “ అని రోజూ అడిగేది. ఆ ప్రశ్నకు తనకు జవాబు తెలియదు. తను ఇంటికి వెళితే అమ్మ, నాన్న గుర్తుకు వస్తారు.
రెండేళ్ళ యాత్రల తరువాత పైనాంపురము చేరినాడు. తాళాలు తీస్తే ఇల్లంతా దుమ్ముతో నిండి యుంది. రైతును పిలిపించి ఇల్లంతా శుభ్రము చేయించినాడు. సరోజ వేసిన పూల మొక్కలు పూర్తిగా ఎండి పోయినాయి. తనకు ఎవరి దగ్గిరకు వెళ్లాలని అనిపించ లేదు. పొరపాటున వెళ్ళినా అందరూ సరోజ మీద వ్యాఖ్యానాలు చేసినారు. ఇంక సరోజ గురించి ఆలోచించడము మాని వేసినాడు.
ఈ రెండు సంవత్సరాల పంటను రైతే అమ్మి వేసి తనకు డబ్బు తెచ్చి ఇచ్చినాడు. తిరిగి నెల్లూరిలో ఉద్యోగమూ కోసము ప్రయత్నమూ చేయాలని అనిపించ లేదు. పగలు వాణిని బడికి పంపించే వాడు. సాయంత్రము వాణిని వెంట పెట్టుకొని పొలాల గట్ల మీద నడక సాగించే వాడు. రెండు వారాలు గడచినా తరువాత ఇంట్లో పుస్తకాల దుమ్ము దులపడము మొదలు పెట్టినాడు. అప్పుడు సరోజ డైరీ బయట పడింది. అందులో సరోజ అభిప్రాయాలు, కలలు, ఇప్పటి విద్య విధానములో లోటు పాట్లు, ప్రాథమిక విద్య నుండి ఎటువంటి మార్పులు చేస్తే బాగుంటుంది, ఇలా ఎన్నెన్నో వ్రాసింది. ఇప్పుడు ఉద్యోగమూ కోసము పాఠాలు చెప్పే టీచరు, విసుగు పుట్టినా తప్పదన్నట్లు వినే విద్యార్థి, ఇటువంటి వ్యవస్థ మారాలని వ్రాసింది.
ప్రాథమిక స్థాయిలో ఎటువంటి  ఆటలు ఉంటే బాగుంటుందో వ్రాసింది. అంతే కాదు, కొంచెము నిలకడ రాగానే “ఒరిగామి” వంటికాగితాలతో బొమ్మలు చేయడము ఉండాలని వ్రాసింది. అప్పుడున్న పాఠ్య ప్రణాళికలో ప్రతి పాతానికి ఒక ప్రయోగాన్ని చేర్చింది. అది కూడా ఎలా చేస్తే పిల్లలు ఎగ బడటారో,ఎలా అయితే ఖర్చు లేకుండా ఇంట్లో వాళ్లకు చూపించ గలరో అటువంటి ప్రయోగాలను వ్రాసింది. ఇంకా నైతిక విలువలు ఒకరు చెబితే వచ్చేవి కావు, ఒకరిని అనుసరిస్తే వచ్చేవి అని వ్రాసింది. అందుకే పిల్లలకు పెద్దలు ఆదర్శముగా నిలబడాలి అని వ్రాసింది.
సరోజ తనతో ఎన్నో సార్లు ఈ విషయాలన్నీ చెప్పేది. తనే సరిగా పట్టించుకోలేదేమో. చాలా బాధ వేసింది.
“సరోజా! సరోజా! నీవెక్కడ ఉన్నావు?” ఇదే ప్రశ్న” తను డిల్లీ వెళ్ళకుండా పొరపాటు చేసినాడేమో?” ఇదొక బాధ. కొన్నాళ్ళు ఇలా బాధ పడినాడు. తరువాత ఒక నిర్ణయానికి వచ్చినాడు.
ఇంటి వెనుక ఇసుక దిబ్బల మీద ఒక రేకుల షెడ్ వేయించినాడు. అక్కడయితే సాయంత్రము పూట బాగా గాలి సోకుతుంది. అందులో కొన్ని బల్లలు కుర్చీలు వేయించినాడు. ఊళ్లోనే యున్న ప్రభుత్వ పాత శాల టీచర్ తో సంపర్కము పెట్టుకున్నాడు. రోజూ తను రెండు గంటలు పాఠాలు , ప్రయోగాలు మొదలు పెట్టినాడు. క్రమముగా అన్నీ షెడ్డు లోనికి మార్చినాడు. ఇందుకు పిల్లల తల్లి దండ్రులను కూడా ఒప్పించినాడు.
వాణి కూడా తనతో బాటు ఉండేది. అక్కడ పిల్లలతో కలిసి పోయి, వారితో బాటు పని చేయడమే గాక తను కూడా సాయము చేసేది. ఆ ఊళ్ళో  పిల్లలకు ఈ పాఠ శాల ఎంత అలవాటు అయిందంటే వాళ్ళు ఒక రోజు మానాలంటే గొడవ చేసే వారు. ఇంటికి వెళ్లి వాళ్ళు ప్రయోగాలకు వస్తువులు పాడు చేసినా వాళ్ళ తల్లి దండ్రులు సంతోషించే వారు. ఆరు నెలల్లో ఈ పాత శాల గురించి పక్క ఊళ్లకు కూడా తెలిసింది. వారు రామును తమ పాత శాలలకు రమ్మని ఆహ్వానించినారు.ఇంకా కార్పోరేట్ పాత శాలల యాజమాన్యాలు రాముకు ఎంత జీతమయినా ఇస్తామని కబురు పెట్టినారు. రాము వేటికీ అంగీకరించ లేదు. మరో రెండేళ్లలో ఉన్నత పాత శాల స్థాయికి దీనిని తీసుకొని వెళ్లాలని ఆశ పడ్డాడు.
ఇప్పుడు రాముకు క్షణము తీరిక లేదు. ఆర్థికముగా ఇబ్బంది ఎప్పుడూ లేదు. కానీ దర్జాగా బ్రదకాలంటే  కుదరదు. కానీ, అటువంటి జీవితమూ పైన తనకు ఏనాడూ  ఆసక్తి లేదు.
ఈ రకముగా మరో సంవత్సరము గడచింది. ఇక్కడ విద్య విధానము యొక్క సమాచారము డిల్లీ వరకు వెళ్ళింది. అక్కడ ఒక కార్పోరేట్ విద్య సంస్థ  తమ వ్యక్తిని పైనాం పురము పంపించాలని అనుకున్నది. ముందు ఉత్తరము  వ్రాసింది. తప్పకుండా చూడ వచ్చని రాము వ్రాసినాడు. ఒక తెలుగు వచ్చిన టీచర్ ను తమ ప్రతినిథిగా అక్కడ పరిశీలించుటకు పంపిస్తున్నామని వ్రాసినారు. ఆ ప్రతినిథి పేరు కూడా వ్రాసి పంపించినారు.
(To be continued)

        

No comments:

Post a Comment