Monday, April 10, 2017

ప్రస్థానము 3

                                            



గోపీ లేదా గోపాల కృష్ణ ఇండియా కు తిరిగి వచ్చినాడు, తన మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ కి  బిజినెస్స్ మేనేజ్మెంట్ ను జోడించుకొని.   శాస్త్ర  సాంకేతిక అవగాహన తో బాటు  సాంస్కృతిక అవగాహన పెంచుకున్నాడు.  రాగానే అంతర్జాలములో తన వివరాలను పెట్టినాడు. కొద్ది రోజులలోనే బెంగుళూర్  నగరములో నొక ప్రముఖ ఇంజనీరింగ్  సంస్థ లో  వ్యాపార సలహాదారు(బిజినెస్స్ కన్సల్టంట్) గా చేరినాడు.
ఒక సారి తిరుపతి లో తమ ఇంటిలో పాత పుస్తకాలన్నీ కలియ బెడుతుంటే అందు లో కొన్ని పాత దైనందినులు (డైరీలు) కనిపించినాయి. అన్నీ తన తాత  రాం గోపాల్ వ్రాసినవి. ఇప్పుడు ఆయన లేరు. కానీ ఆయన ఆలోచనల స్వరూపము తెలుసుకోవాలంటే ఇవి ఒక ఆధారము. వాటిలో ప్రతి చోటా మనుషుల  ఆలోచనలలో వస్తున్న మార్పులు, పెరుగుతున్న స్వార్థము, తను ఎదగాలన్న కోర్కెతో  సమాజానికి ఎంత హాని చేస్తున్నాడు, ఈ విషయాలే వివరణలతో ఉన్నవి. అది ఆయనకు సంబంధించిన దైనందిని లా కనిపించ లేదు. మనుషులలో ఆలోచనలను రేకెత్తించే వ్యాసాల సంపుటి వాలే కనిపించినది. వాటిని హడావిడిగా చదవ లేము. రోజూ కాస్త నెమ్మదిగా చదవాలి. తండ్రి అనుమతితో అన్నీ తన వెంట బెంగుళూర్ తీసుకొని వెళ్ళినాడు.
పారిశ్రామిక సంస్థలలో పని చేసే ఇంజనీర్లు అప్పుడపుడు తన దగ్గిరకు వచ్చే వారు. వారి సమస్యలను వివరముగా చర్చించే వారు.వారి అవసరాలను బట్టి తను సలహా ఇచ్చే వాడు. అందుకవసరమయిన సమాచారము అంతటినీ అందించే వాడు. ఇందుకు కొంత రుసుమును(కన్సల్టేషన్ ఫీజ్ )  తీసుకొనే వారు.  ఈ చర్చలలో వారి ఆలోచన స్థాయి,  సామాజిక విషయములలో వాలకున్న నైతిక విలువలు ఇటువంటివి అన్నీ స్పష్టము గా తెలిసేవి.
కొంత మంది వచ్చే వారు,వారికి కావలసినది, తాము తయారు చేసే వస్తువు మన్నిక కలిగి ఉండాలి,ఖర్చు చాలా తక్కువ ఉండాలి, అందుకు మూడు సరుకును మార్చ వలెనా? యంత్రము యొక్క సామర్థ్యము పెంచాలంటే ఇంకేమి జాగ్రత్తలు తీసుకోవాలి? తమ వస్తువులను కొనే వారి యొక్క సంతృప్తిని ఎలా పెంచాలి? ఇవన్నీ న్యాయ బద్ధమయిన ఆలోచనలు. ఈ విధముగా చర్చించుటలో తనకు ఏంతో సంతృప్తి, సంతోషము కలిగేది. అయితే  ఇటువంటి వారి సమాఖ్య చాలా తక్కువగా ఉండేది.
ఎక్కువ మంది దృష్టి  సంపాదించే లాభాల మీదనే ఉండేది.  ఇలా చేస్తే లాభాలు పెరుగుతాయి కదా అని అడిగే వారు. అది తన సలహా తీసుకొన్నట్లు కాకుండా తనకు సలహా ఇచ్చినట్లు ఉండేది. పరిశ్రమలలో వచ్చిన మురికిని ప్రక్కన కాలువలలో కలుప వచ్చును కదా  అని అడిగిన వారికి ఏమి జవాబు ఇవ్వాలో తెలిసేది కాదు. దానిని తిరిగి శుద్ధి చేయడము, ఎలా చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, మొత్తము వివరాలను చెప్పే వాడు. కానీ, వారి మాటలలో తనకు తెలిసేది. బహుశా వారు ఖర్చులు తగ్గించుకొనుటకు లాభాలు పెంచుకోనుటకు ఆ పని చేయరని.
సిమెంటు పరిశ్రమలలో , థర్మల్  విద్యుత్ కేంద్రాలలో బూడిద  తో బాటు అతి సూక్ష్మ స్థాయి లో యున్న దుమ్ము కణాలు వస్తాయి. ఇవి మామూలు పద్ధతులలో బూడిద లోనికి వెళ్ళకుండా గాలిలో కలుస్తుంది. ఇది చుట్టు ప్రక్కల వారు పీల్చే గాలితో కలిసి, కొద్ది కాలములోనే చుట్టూ ప్రక్కల వారిలో ఊపిరి తిత్తుల వ్యాధికి కారణము అవుతుంది. ఈ కణాలను గాలికి వెళ్ళనీయకుండా ఎత్తైన గొట్టాల ద్వారా పైకి పంపిస్తూ స్థిర విద్యుదయస్కాంత శక్తి ద్వారా నెలలో కలిసి పోయేటట్లు చేయ వచ్చును. కానీ ఇందుకు పెట్టుబడి పెట్టాలి.
ప్రతి సమస్యకూ ఒక పరిష్కారము ఉంటుంది. కాని దానికి అయ్యే ఖర్చు లాభాలను బాగా తగ్గించి వేస్తుంది. ఈ విధముగా పరిశ్రమలనుంచి వచ్చే పర్యావరణ కాలుష్యాన్ని నివారించుట జరుగుట లేదు.
  అంతే కాదు, తమ తయారీ వస్తువు యొక్క సామర్థ్యము పెంచి అమ్మాలి అనే కంటే ఎదో విధముగా ప్రజలను మభ్య పెట్టి వారి చేత కొనిపించాలనేది లక్ష్యముగా ఉంది.
సోనీ కంపెనీ స్థాపకుడి ఆత్మ కథలో ఒక విషయముంది. తమ తయారీ లో ఒక్క పరికరములో దోషము కనిపించేసరికి, దానితో తయారయిన అన్ని పరికరాలన్నీ చెత్తలో వేయించేశారు. ఎందుకంటే సోనీ పరికరాలలో దోషము ఉండదనే నమ్మకము పోగూడదు.
మన దేశములో మొట్ట మొదట స్టీలు పరిశ్రమతో బాటు ఇతర పరిశ్రమలు స్థాపించిన వారు టాటాలు. జమ్షెడ్జీ టాటా వారిలో ప్రముఖుడు. వారి పరంపరలో ఒకడైన జే ఆర్ డి  టాటా ఒక ప్రముఖ విద్యా సంస్థలో ఉపన్యాసము ఇచ్చినపుడు, ఒక విద్యార్థి అడిగినాడు,” మన దేశములో మంచి క్వాలిటీ వస్తువులు ఎందుకు రావటము లేదు?” అని. అందుకు ఆయన ఇచ్చిన జవాబు,”నిర్మాణము పరిపూర్ణతను అందుకోనుటకు ఎవరికీ ఇష్టము లేదు. అది పని చేస్తుంది. అంతే చాలు.”(It is enough, it works, that’s all.. It is their motto)
వేయి సంవత్సరాల తరువాత కూడా తుప్పు పట్టని ఇనుమును  తయారు చేసిన భారతీయుల లోనా, ఇంత మార్పు. గోపీ లో ఆలోచనలు చేల రేగినాయి.
ఇంట్లో ఏదయినా పరికరము పాడయితే , దానిని సరి చేసుకొని వాడటమే తప్ప , తొందర పడి మరొకటి కొనే వారు కాదుట. నాన్న చెప్పే వారు. కానీ, విదేశీ మార్కెట్ల  ప్రభావము గ్లామర్/ఆకర్షణ  ఎంత వచ్చిందంటే , అవసరము లేకున్నా కొనే సంస్కృతి వచ్చి పర్యావరణానికి ముప్పు తెచ్చింది. డబ్బు చేతిలో ఉంటె ప్రతి యొక్క మాడల్ తప్పకుండా ఇంట్లోకి రావలసిందే.
 ఈ ఆలోచనల పరంపరలోనే రామ్ గోపాల్ తాత గారి దైనందినులను చదవడము మొదలు పెట్టినాడు. ఆయనకు చిన్నప్పుడు పైనాంపురము ఎలా ఉండేదో,  క్రమముగా ఎటువంటి మార్పులు వచ్చినాయో  అందులో వివరముగా ఉన్నాయి. ఆయన విశ్లేషణ కూడా అద్భుతముగా ఉంది.
అనంత పురము పైనాంపురము జంట గ్రామాలు. విశేషము ఏమిటంటే అనంతపురము తోటపల్లి గూడూరు మండలానికి పైనాంపురము ముత్తుకూరు మండలానికి సంబంధించినవి. ఈ ఊళ్లకు సముద్రము ఒక మైలు దూరములో
ఉంటుంది. అంటే సుమారుగా ౧.౬ కిలో మీటర్ దూరములో ఉంటుంది. అందుకే సముద్రము హోరు మీడున్నపుడు శబ్దము ఇక్కడికి వినిపిస్తుంది. ఈ  ఊర్లది పూర్తగా ఇసుక నేల. గాలి కొట్టిందంటే ఇసుక అంతా ఇంట్లోనే ఉంటుంది. అంతే కాదు, ఆ ఇసుక మీద పొరలినా ఏ మాత్రమూ అంటుకోదు. విదిలిస్తే పది పోతుంది.  అనంత పురము తరువాత  కుమ్మర పాలెము, ఆ పైన వరకవి పురము అనే గ్రామాలున్నవి. వరకవిపురములో వేయి యకరముల విస్తీర్ణము గల నీటి చెరువు ఉన్నది. చుట్టూ పక్కల గ్రామాల పంటలకు అదే ఆధారము. నెల్లూరు ప్రక్కన ప్రవహించే పినాకినీ నదికి శ్రీ రంగ నాయకుల గుడి సమీపములో ఒక అడ్డు కట్ట ఉంది.  దానిని ఎవరు నిర్మించినారో నెల్లూరు వారు మరిచి పోయినారు. నెల్లూరు కోవూరు ల మధ్య ఉన్న వంతెనను కాటన్ దొర కట్టించినారని ఉంది. గోదావరికి ధవళేశ్వరము వద్ద బారేజి కట్టించిన కాటన్ దొర బహుశా ఈ ఆనకట్టను(బారేజి)ను కూడా కట్టించి ఉండ వచ్చును. అక్కడనుండి నీరు వేరు వేరు చెరువులకు అందుతుంది. అందులో వరకవిపురము చెరువు కూడా ఒకటి.
          వరకవిపురము నుండి నీరు వచ్చే వాగుకు పంజల మడుగు అనే వారు. అది ఊరికి ఉత్తర దిశలో ప్రవహించి బకింగ్హాం కాలువలో కలుస్తుంది. కాకినాడ నుండి  చెన్న పట్నము(ఈ పేరు తరువాత మద్రాసు గాను తిరిగి చెన్నై గానూ మారింది.) వరకు వస్తువులను నీటి మార్గము ద్వారా తీసుకొని వచ్చుటకు తీరము వెంబడి సముద్రమునకు ఒక మైలు దూరములో  బకింగ్  హం అనబడే బ్రిటిషు అధికారి దీనిని తవ్వించినాడుట. అది ఊరికి తూర్పు వైపున ఉంది. ఈ కాలువను అక్కడక్కడ కాలువల ద్వారా సముద్రపు నీటితో  కలిపి సంవత్సరము పొడుగునా అందులో నీరు ఉండేట్లు చూచినారు. పెట్రోలు వాడకము తక్కువగా ఉన్న ఆ రోజులలో అక్కడ నుండి చెన్న పట్ణానికి ధాన్యము పడవల ద్వారా వెళ్ళేది. సమయము ఎక్కువయినా చాలా తక్కువ ఖర్చు అయేది. పర్యావరణ పరముగా కూడా అది సురక్షితము.
          బకింగ్ హాం కాలువ దాటితే వాగర్త గ్రామము వస్తుంది. పంజల మడుగు  బకింగ్ హాం కాలువల మధ్య అనంతపురము పైనాంపురము గ్రామాలు ఇమిడి ఉన్నవి. మధ్యలో కొన్ని పంట పొలాలు, పొలాలకు పడమరగా ఇసుక నేల ఇంకా పడమరగా ఇళ్ళు వస్తాయి.
          తాతగారికి ముందే అక్కడ వ్యావసాయిక వ్యవస్థ ఏర్పడి యున్నది. పొలాలలో వారి పంట వేసే వారు. ఆ రోజులలో ప్రకృతి లో ఆటు పోట్లను ఎదుర్కొన్న వారి వంగడాలు, తెల్ల కేసర్లు, ఎర్ర కేసర్లు, మరియు మొలగోలకులు అనే పంటలను వేసే వారు. కేసర్లు గింజ చాలా లావుగా ఉండేది. అందులో ఎర్ర కేసార్లు పంటను శ్రామికులు ఎక్కువగా తినే వారు. దాని రుచే వేరుగా ఉండేది. మధ్య రకం కుటుంబీకులు ఎక్కువగా తెల్ల కేసర్లు మొలగొలకులు తినేవారు. పై స్థాయి వారు మొలగొలకులు మాత్రమె తినే వారు. వీటి రుచి చాలా ప్రసిద్ధి గాంచినది. వీటిని రాజనాలు అని కూడా అనే వారు. వీటి వలననే నెల్లూరు జిల్లా బియ్యానికి పేరు వచ్చినది. ఇవి అన్నీ ప్రకృతి యొక్క పరిశోధనలో వచ్చిన పంటలు. అందుకే వాటి మీద పురుగుల దాడి కూడా ఉండేది కాదు. పురుగు మందుల అవసరము వచ్చేది కాదు.
          రైతులకు పొలాలు కాకుండా అవసరమయినవి పశు సంపద. ఆవులకు కోఠాలు ఉండేవి. పగలంతా అవి బయటికి మేతకు వెళ్ళేవి. రాత్రి వాటికి ఆ కొఠాలలో విశ్రాంతి. అక్కడే ఎందు గడ్డి పడేసే వారు. అవి తినగా నలిగినా మిగిలిన గడ్డి వాటి పేడ మూత్రముతో కలిసి ఎరువుగా తయారు అయేది అదే ఆ నాడు పొలాలకు ఎరువు.
          వాళ్లకు బాగా పండిన పొలాలలో వారి గింజలను బాగా ఎండ బెట్టి మూటలు కట్టి పెట్టె వారు. వాటినే తరువాత పంటకు ఎరువులుగా వాడే వారు. వారి ఇంకా పదిహేను రోజులలో కోతకు వస్తుందనగా పెసల మూటలు తడిపి మోము రాగానే  ఆ పొలాలలో చాల్లే వారు. వరి కోతలు అయిన తరువాత పెసలు పెరిగేది. కాయలు వచ్చి ఎండిన తరువాత కోసి నూర్చే వారు. ఇది అదనముగా వచ్చే లాభము. తిరిగి ఈ పెసలనే విత్తనాలుగా వాడే వారు. ఇందులో వచ్చిన చెత్త ఎద్దులకు  మేతగా ఉపయోగ పడేది. అంతే గాక ఎద్దులకు మాత్రమె పిల్లి పెసర (శతావరి) పంటను వేసే వారు. ఈ విధముగా తమ ఆహారముతో బాటు పశువులకు మంచి పోషణ ఇచ్చే ఆహారమును అందించే వారు.
          మెట్ట ప్రాంతములలో వంగ, మిరప, రామ మునగ(టమాటో) లాంటి పంటలు, కూర గాయాలు  వేసే వారు. ఆ రోజులలో మిరప తప్ప మిగిలిన కూర గాయలతో పెద్ద కుటుంబాల వారు వ్యాపారము చేసే వారు కాదు. ఎవరడిగినా కూర గాయలను ఊరికే ఇచ్చే వారు. ఇంకా ఆవు దూడలను ఎంత ప్రేమగా చూచే వారంటే, పేరుతొ పిలిస్తే అవి పరుగెత్తుకొని వచ్చేవి. అది ఆనాటి మనుషులకు పశువులకు ఉన్న అనుబంధము.
          అప్పుడప్పుడు నేలలో సత్తువ పెరగడానికి నీలి, జనుము, వెంపల వంటి విత్తనాలు చల్లి మొక్కలు ఎదిగిన తరువాత  వాటిని దున్నించే వారు. అవి మట్టితో కలిసి పోయేవి. ఈ రకముగా నేల సత్తువ పెంచి ఎక్కువ పంటలు పండించే వారు. అంతే గాని వారికి ఆనాడు రసాయనిక ఎరువుల అవసరము కనిపించేది కాదు.
తన దైనందినిలో ఒక చోట వ్రాసినారు.
          “ఇవన్నీ వ్రాయ వలసిన అవసరముందా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ, వస్తున్న మార్పులు, వాటి వలన వచ్చిన ఆలోచనలలో మార్పులు చూస్తుంటే, గతములో ఒకప్పుడు ఇలాగుండేది అని చెప్పే వారు కూడా ఉండరేమో అని అనిపిస్తుంది. ప్రకృతికి మనిషికి గతములో ఉండేది అనుబంధము, ఇప్పుడుండేది వ్యాపార బంధము. తిరిగి, తిరిగి, మనిషి ఎక్కడికి వేల్లుతున్నాడో తెలియటము లేదు. మనిషికి  నేలకు, మనిషికి పశువుకు  ఉన్న ప్రేమ  అనుబంధాలు కరిగి పోతున్నాయి.” ఈ విషయములో చిదానంద భారతి చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చినాయి.
          సంక్రాంతికి ఇంటికి పంటలు ఇంటికి వచ్చేవి. అదే సమయాన కూర గాయాలు కూడా బాగా పండేవి. సూర్యుడు మకర రాశికి చేరే ఆ కాలములో ఎవ్వరూ నిరాహారముగా ఉండ కూడదు అన్న భావన కొన్ని అలవాట్లకు దారి తీసింది. సంక్రాంతికి ముందు రోజు పాత వస్తువులను తగల పెట్టే వారు. దీనినే భోగి అనే వారు. సంక్రాంతి నాడు పితృ దేవతలకు తర్పణాలతో బాటు ఇంట్లో పిండి వంటలు చేసే వారు. ఆ మరునాడు పశువులను అందముగా అలంకరించి వాటికి ప్రత్యేకముగా ఆహారము పెట్టె వారు. దీనిని పశువుల పండగ అనే వారు. ఈ మూడు రోజులు  వాకిట్లో బియ్యపు బస్తా పెట్టి, ఇంట్లో చిన్న పిల్లలకు ఒక బాధ్యతా అప్ప చెప్పే వారు. వచ్చిన ప్రతి యొక్కరికి ఒక చిన్న పాత్రతో బియ్యము పోయదము పిల్లల పని. రోజూ వందల మంది వచ్చే వారు. ఈ ఒక్క పని సమాజములో ఒక బాధ్యతను గుర్తు చేసేది. అంతే గాక చిన్న పిల్లలకు దానము చేసే అలవాటు వచ్చేది. ఈ విధముగా ఇంకో తరము తయారు అయేది.

          ఆ సమయములోనే ఊళ్ళో ఆసక్తి ఉన్న వాళ్ళు వీధి నాటకాలు వేసే వారు. అర్థ రాత్రికి ముందు మొదలయి సూర్యోదయము వరకు జరిగేవి. ఇటువంటి రోజులు చెదిరి పోతున్నాయి మళ్ళీ వస్తాయో లేదో? ఇదే పెద్ద ప్రశ్న.
(To be continued )

No comments:

Post a Comment